(వర్డు ప్రెస్ లో ఈ కవితతో రెండేళ్ళ క్రితం ఓ బ్లాగ్ ప్రారంభించి వదిలేశా. మళ్ళీ దానితోనే మొదలు పెడుతున్నా)
మట్టికాళ్ళ మహా రాక్షసీ!
మహా సామ్రాజ్యం
కుప్పకూలుతున్న
ఫెళ ఫెళార్భటులు
భయోత్పాతాలై
ఫ్రీ మార్కెట్లను చుట్టేశాయి!
నీ చావుని
నీ దగ్గరికే చేర్చాయి
నీ మట్టికాళ్ళ పరుగుల కోసం
మా బతుకులపై
కారిడార్లు నడిపిస్తావా!?
మా చెమట చుక్కల సమాహారమే
ఈ మహా సముద్రం!!!
వేల తరాల ఆత్మబంధం
మాదీ సముద్రానిదీ!
మా పేగు బంధాన్ని
తెంచే పాటిదా నీ కారిడార్?
మా స్వేద సంద్రాల
ఉద్యమ సునామీల్లో
మీ కోస్తా కారిడార్లు
కొట్టుకుని పోతాయ్!
నీ మట్టి కాళ్ళను
కరిగించి కలిపేసుకుంటాయ్!
సముద్ర తిమింగలాల్ని వేటాడ్డమే
ఇప్పటిదాకా మాకు తెలిసింది
మానవ తిమింగలాల
వేట కోసం
మా వలల్నీ
మా పడవల్నీ
సిద్ధం చేస్తున్నాం!!!