(శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ధర్మల్ ఫ్యాక్టరీల పేరుతో ప్రజల పొట్టకొడుతూ బీల నేలల్లో బూడిద కుప్పలు నింపుతున్న ప్రభుత్వ విధానాలకీ వ్యతిరేకంగా...)
ఏటీ అన్నేయము?
మీ ఊసుకొచ్చామా? మీ జోళు కొచ్చామా?
ఉన్ననాడు తిన్నాం
నేన్నాడు... ఆకలికి మన్నే తిన్నాం
ఈవలకి సెమట సుక్కలే సప్పరించినాం
మిమ్మల్ని ఎన్నడైనా పొయ్యి కిందకి నేదని
అడిగామా?
పొయ్యి మీదకి నేదని అడిగామా?
మరేటీ అన్నేయము!!
ఎలచ్చన్ల ముందు వంగి వంగి దండమెడితే
మీ కిటుకులు కానుకోక
మాము నేలను సతికిలబడి
మిమ్మల్ని అందలమెక్కిస్తే
మమ్మల్ని ఎంగులాకులను సేసి
ఏమీ ఎరగనోల్లా ఎల్లిపోతుంతే
ఏమిరా కొడకా ఎలా సేసావని
పల్లెత్తి మాటన్నామా?
పల్లకుంతే పర్లేదనుకున్నారు గావాల
మా దిబ్బలమీద దీపాల ప్యాట్రీ ఎట్టీసి
మా ఇంటి దీపాలను అర్పెత్తన్నరు
ఇన్నాళ్ళు ఎనకమాల కొడుతుంతె సయించినాం గానీ
కల్లెదుటె కడుపు మీద కొడతామంతే
సేకానోల్లా సేతులు కట్టుకుని ఎలాగుంతం కొడకా
సీమలపుట్టలో సెయ్యెట్టేసి
పామై నీవు పడగెత్తి కొస్తుంతే
పులిలా కలలుడకుండా
పొయ్యిలో పిల్లెల్లే ఎలా తొంగుంతాం కొడకా
అగ్గిలపడిన సిమిడి పిక్కల్లే సుయ్యిమంతు చిందులేత్తాం
సేతి కందిన కంపో, కర్రతో కరెంటు సీమలై
కలబడతాం!!!
(రచన: నెల్లిమర్ల శ్రీనివాస్)