మీ ఊపిరులతో నోట్ల కట్టలు
ప్రాణం పోసుకుని పరుగులు తీస్తున్నపుడు...
మీ మానాలు సిగరెట్ కాల్చడం కంటే
తేలిగ్గా భంగం అవుతున్నపుడు...
మీ దేహాలు ఆ చూపులకి ఆవిరై
మాంసపు ముద్దలుగా ఘనీభవిస్తున్నపుడు...
మీ ఆశలు ప్రాణ ప్రతిష్ట కాకముందే
ఎనిమిదో అడుగులోనే సమాధి అవుతున్నపుడు...
మీ కన్నీటికి ఇక
ఏ మాత్రం ఓదార్పు దొరకదు!
పురుషత్వం అహంకార బురుజులపై
బీరాలు పలుకుతున్నపుడు...
మతాలు 'బురఖాల్ని'
దాటి రావద్దని శాసిస్తున్నపుడు...
వెండి తెరపై మీ శీలం
నగ్నంగా ఆరవేయబడుతున్నపుడు...
వర శుల్కం వధ్య శిలపై మీ అస్తిత్వమే
ఓ ప్రశ్నగా మిగిలినపుడు...
మీ వేడుకోళ్ళు ఇక
ఎంతమాత్రం మిమ్మల్ని రక్షించవు!!
ఎర్రటోపీల సాక్షిగా మీ ఆర్తనాదాలు
లాకప్ గదుల్లో రికార్డవుతున్నపుడు...
మానభంగ నిర్ధారణకై
నల్లకోట్లు సిగపట్లు పడుతున్నపుడు...
మీ శవాలతో పోస్టుమార్టం బల్లపై
తెల్లకోట్లు బిలియర్డ్స్ ఆడుతున్నపుడు...
వ్యవస్ధ చిత్రపటంపై మీ జీవితాలు
నెత్తుటి మరకలుగా ప్రత్యక్షమవుతున్నపుడు...
మీ మౌనం ఇక
ఎంతమాత్రం పరిష్కారం కాదు!!!
(రచనా కాలం:04/03/1990)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అవాంఛిత వ్యాఖ్యలను తొలగించబడతాయని విన్నవించుకుంటున్నాను.